జూనియర


ప్రస్తుతం సినిమాలాగానే టీవీ కూడా పవర్‌ఫుల్‌ మీడియాగా మారింది. సినిమా స్టార్స్‌తో సమానంగా స్మాల్‌స్ర్కీన్‌ స్టార్స్‌ కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెండితెర ఇలవేల్పులు కూడా బుల్లితెర మీదకు రావడానికి సంకోచించడం లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఈ ట్రెండ్‌ ఎప్పుడో మొదలైంది. అమితాబ్‌, సల్మాన్‌, ఆమిర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్లు బుల్లితెర మీదా సత్తా చాటారు.

తెలుగులో ఈ ట్రెండ్‌ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వెండితెర మీద స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగార్జున, చిరంజీవి వంటి టాప్‌హీరోలు బల్లితెర మీదా మెరిశారు. ఇప్పుడు తాజాగా యంగ్‌టైగర్‌ ఎన్టీయార్‌ కూడా స్మాల్‌స్ర్కీన్‌పై తన సత్తా చాటడానికి సిద్ధమైపోతున్నారు. హిందీలో సూపర్‌ హిట్‌ రియాల్టీ షోగా నిలిచిన బిగ్‌బాస్‌ను పోలిన ఓ ప్రోగ్రామ్‌ను స్టార్‌ మా ఛానెల్‌ రూపొందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు ఎన్టీయార్‌. ఇప్పటికే ఈ విషయమై ఛానెల్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారట ఎన్టీయార్‌. ఈ విషయాన్ని సదరు ఛానెల్‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేస్తూ అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెరమీద రెగ్యులర్‌గా కనిపించనుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇక తమను రోజూ అలరించబోతున్నాడంటూ ఆనందపడుతున్నారు. నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్తే అని చెప్పవచ్చు.