రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌..?

0

ఎన్టీఆర్‌ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారిప్పుడు. వరుసగా విజయాల్ని సొంతం చేసుకొంటూ, అభిమానుల్లో రెట్టింపు సంతోషాన్ని నింపుతున్నారు. నటుడిగా కూడా ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ దశలోనే ఆయన వైపు నుంచి మరిన్ని కొత్త కబుర్లు వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు వాటి గురించి మరింత ఉత్సాహంగా మాట్లాడుకొంటున్నారు. అవన్నీ అనుకొన్నట్టుగా జరిగితే మాత్రం ఈ యేడాది ఎన్టీఆర్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయం.

గతేడాది ‘జనతా గ్యారేజ్‌’తో కొత్త రికార్డుల్ని సృష్టించారు ఎన్టీఆర్‌. అలాంటి సినిమా గురించి ఆయన ఎప్పట్నుంచో ఎదురు చూశారు. తన ఆశలకి తగ్గట్టుగా ‘జనతా గ్యారేజ్‌’ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ విజయాన్ని నిలబెట్టుకోవడంతో పాటు… తదుపరి అందుకు దీటైన సినిమా చేయాలనే ప్రయత్నంలో ‘జై లవకుశ’ కథని ఎంచుకొన్నారు. ఆ చిత్రంతో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఎన్టీఆర్‌లోని నటుడినీ, ఆయనకున్న స్టార్‌ ఇమేజ్‌నీ సంతృప్తి పరిచేలా ఆ చిత్రం ఉంటుందని ‘జై లవకుశ’ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ని మూడు పాత్రల్లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తుంటే… మరోపక్క అంతకుమించిన ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని, అలాగే తదుపరి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారని ప్రచారం వూపందుకొంది.

భారీ పారితోషికం

బుల్లితెరపై విజయవంతమైన కార్యక్రమం… బిగ్‌బాస్‌. హిందీలో సల్మాన్‌ఖాన్‌లాంటి అగ్ర కథానాయకులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరహా కార్యక్రమం తెలుగులోనూ నిర్వహించబోతున్నారు. తెలుగులో కార్యక్రమం నిర్వహణ కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించారు. మాస్‌లో విశేష ఆదరణని సొంతం చేసుకొన్న ఎన్టీఆర్‌తో కార్యక్రమ నిర్వహణకి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలిసింది ఓ కార్పొరేట్‌ సంస్థ. అందుకోసం ఆయనకి భారీగా పారితోషికం అందజేస్తున్నట్టు సమాచారం. ‘బిగ్‌బాస్‌’తో బుల్లితెరపై సందడి చేసిన అగ్ర తారల జాబితాలోకి ఎన్టీఆర్‌ చేరబోతున్నారు. చిరంజీవి, నాగార్జునలాంటి కథానాయకులు ఇప్పటికే బుల్లితెరపై విజయవంతంగా మెరిశారు.

నాలుగోసారి…
‘జై లవకుశ’ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఆయన తదుపరి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలోనే నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వారిద్దరి కలయికలో నాలుగో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకు ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాలు చేశారు. నాలుగో చిత్రం అనేది ఒకెత్తయితే, రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడం మరో ప్రత్యేకమైన విషయం అవుతుంది. అయితే ఆ చిత్రం గురించి ఇటు రాజమౌళి కానీ, అటు ఎన్టీఆర్‌ కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు. తెలుగు సినిమా వర్గాలు మాత్రం రాజమౌళి తదుపరి డి.వి.వి.దానయ్య నిర్మాణంలో సినిమా చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్‌ కథానాయకుడని చెబుతున్నాయి.

Comments

Share.

Comments are closed.