ఎన్టీఆర్‌… అవార్డుల ‘బాద్‌షా’

0

సునామీ మామూలుగా రాదు. వస్తే అంతా తుడిచిపెట్టుకుని గానీ వెళ్లదు. ఎన్టీఆర్‌ కూడా అంతే. నటన.. డ్యాన్స్‌.. ఫైట్స్‌.. సింగింగ్‌.. ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన ముద్రవేయడమే కాకుండా సున్నితమైన భావోద్వేగాలను సైతం చక్కగా పలికించగల అతికొద్ది మంది నటుల్లో ఒకరు. అలాంటి నటుడికి అవార్డులు రావడం వింతేమీకాదు. అందుకే అటు నటుడిగా, సింగర్‌గా వివిధ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. గతేడాదికి ప్రకటించిన వివిధ అవార్డుల్లో ఆయన ‘బాద్‌షా’గా నిలిచారనడం అతిశయోక్తి కాదు. తాజాగా శుక్రవారం అబుదాబి వేదికగా సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అవార్డుల ప్రదాన కార్యక్రమంలోనూ ఎన్టీఆర్‌కు మరో అవార్డు వరించింది. 2016 సంవత్సరానికి గానూ ఉత్తమనటుడి అవార్డు ఎన్టీఆర్‌(జనతా గ్యారేజీ) సొంతమైంది. దీంతో గతేడాదికి ఎన్టీఆర్‌కు వచ్చిన అవార్డుల సంఖ్య 7కు చేరింది. మొత్తం 9 అవార్డులకు ఎన్టీఆర్‌ నామినేట్‌ అయ్యారు.

ఐఫా ఉత్సవం (జనతా గ్యారేజ్‌), ఫిలింఫేర్‌ సౌత్‌ (నాన్నకుప్రేమతో), శంకరాభరణం అవార్డ్స్‌ (జనతా గ్యారేజ్‌), సైమా (జనతా గ్యారేజ్‌)లలో ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డులను దక్కించుకున్నారు. ఇక జీ సినిమాలు అవార్డుల్లో కింగ్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ (జనతా గ్యారేజ్‌) అవార్డును కైవసం చేసుకున్నారు. మిర్చి మ్యూజిక్‌ అవార్డ్స్‌లో ‘స్టార్‌ యాజ్‌ ఏ సింగింగ్‌’ కేటగిరిలో నాన్నకు ప్రేమతో (ఫాలో.. ఫాలో..), చక్రవ్యూహ (కన్నడ గెలియా…గెలియా) చిత్రాలకు అవార్డులు దక్కాయి.

ఇప్పటివరకూ ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఉత్తమ నటుడిగా (బాల నటుడు, కథానాయకుడు) 10కి పైగా అవార్డులను అందుకున్నారు. ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘రాఖీ’, ‘యమదొంగ’, ‘టెంపర్‌’ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా నివేదా థామస్‌ కథానాయికలు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ‘జై లవకుశ’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌లో ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.