జూలై 16 నుంచి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో

0

బిగ్‌బాస్ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచి తారక్ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆ రియాలిటీ షోపై ఆసక్తి ఏర్పడింది. ప్రోమో విడుదల, బిగ్ బాస్ టీజర్‌తో జనాలను బాగానే ఆకర్షించింది.. ఆ షో ఎప్పుడు టీవీలో ప్రసారమవుతుందా అనే ఉత్సుకత సగటు తారక్ అభిమానిలో ఉంది. అయితే ఆ రోజు రానే వచ్చింది. జూలై 16 నుంచి స్టార్ మా టీవీలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది. ట్విట్టర్‌లోనూ పత్రికా ప్రకటనను పోస్ట్ చేసింది స్టార్ మా యాజమాన్యం. ఆ పత్రికా ప్రకటన సారాంశం…

‘‘తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌ను జూలై 16 నుంచి ప్రసారం చేయబోతున్నాం. ఆ షోతో తెలుగు టీవీ మార్కెట్ ఓ కొత్త శిఖరాలను అధిరోహించబోతోంది. తొలిసారిగా బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. షోలో 12 మంది సెలెబ్రిటీలు పోటీ పడబోతున్నారు. దాదాపు 70 రోజుల పాటు ఓ పెద్ద ఇంట్లో 60 కెమెరాల మధ్య వారిని బంధించేస్తాం. బయటి ప్రపంచంతో వారికేమాత్రం సంబంధం ఉండబోదు. సరైన పోటీదార్ల కోసం స్టార్ మా యాజమాన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే వంద మంది సెలెబ్రిటీలను కలిశాం. షోపై చాలా మంది ఆసక్తిని కనబరిచారు. అయితే సరైన 12 మందినే షో కోసం ఎంపిక చేస్తాం’’ అని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది.

కాగా, తొలి ప్రోమో విడుదలైనప్పటి నుంచే బిగ్ బాస్ షో అంచనాలు పెంచేసిందని, కేవలం వారంలోనే 5.5 కోట్ల మంది ప్రోమోను వీక్షించి కార్యక్రమాన్ని ఓ ఎత్తుకు తీసుకెళ్లారని ఆ ప్రకటనలో స్టార్ మా యాజమాన్యం వివరించింది. బిగ్ బాస్ తెలుగు ప్రోమో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉందని, సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఆ ప్రోమోను షేర్ చేశారని, షేర్ల సంఖ్య మిలియన్ దాటిపోయిందని పేర్కొంది. ఇక, తెలుగు టీవీలో అత్యంత భారీ ఖర్చుతో తీస్తున్న రియాలిటీ షో బిగ్ బాసేనని, అతిపెద్ద సెట్లో షూటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. 10 వేల చదరపుటడుగుల విశాలమైన సెట్లో 750 మంది షో కోసం పనిచేస్తున్నారని వివరించింది. షోకు స్క్రిప్ట్ లేదని, సంప్రదాయంగా డైరెక్టర్ వాడే ‘కట్’ అనే పదమూ ఎక్కడా వినిపించదని, 60 కెమెరాలు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాయని ప్రకటనలో వివరించింది. కాగా, జూలై 16 నుంచి గ్రాండ్‌గా బిగ్ బాస్ షో ప్రసారం అవుతుందని, ఎన్టీఆర్ చెప్పినట్టు తెలుగు టీవీ చరిత్రలో రియాలిటీ షో రూపురేఖలను బిగ్ బాస్ మార్చేస్తుందని స్టార్ మా యాజమాన్యం తన ప్రకటనలో వెల్లడించింది.

[embedyt]https://www.youtube.com/watch?v=IULWdfe57Cw[/embedyt]

Comments

Share.

Comments are closed.