జోరు సాగిపోనీ…

0

దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర… అంటూ ఎన్టీఆర్‌తో పూరి జగన్నాథ్‌ ఏ క్షణాన ఆ డైలాగ్‌ పలికించాడో తెలియదు కానీ… నిజంగా అప్పట్నుంచే ఎన్టీఆర్‌ దండయాత్ర షురూ చేశాడు. బాక్సాఫీసు దగ్గర తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’… ఇలా వరుసగా విజయాల్ని సొంతం చేసుకొన్నాడు. ఆ విజయాలు అందించిన ఉత్సాహం ఎన్టీఆర్‌ని ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే ఆయన జోరు అలా కొనసాగుతూనే ఉంది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా తనకి తిరుగులేదని చాటి చెబుతున్నాడు. ఒక పక్క కొత్త చిత్రం ‘జై లవకుశ’ ముచ్చట్లతోనూ.. మరో పక్క బుల్లితెర సందడితోనూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ద.. ద.. దండయాత్ర ఇప్పట్లో అస్సలు ఆగేలా కనిపించడం లేదు. పరిశ్రమకి, ప్రేక్షకులకు కూడా అదే కావాలి. ఎన్టీఆర్‌లాంటి ఓ అగ్ర కథానాయకుడు ఫామ్‌లో కొనసాగాడాంటే చిత్ర పరిశ్రమకీ బోలెడంత మేలు జరుగుతున్నట్టే.

ఎన్టీఆర్‌ ప్రయాణాన్ని గమనిస్తే ఇప్పుడాయన నటనని అణువణువూ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. హిట్టు ఫార్ములాని పక్కన పెట్టేసి వైవిధ్యమున్న కథలవైపే మొగ్గు చూపుతున్నాడు. అందుకే ఆయన్నుంచి ఎప్పటికప్పుడు కొత్త రకమైన చిత్రాలొస్తున్నాయి. ‘టెంపర్‌’ తర్వాత గుబురు గెడ్డంతో ‘నాన్నకు ప్రేమతో’ చేస్తున్నప్పుడు ‘ఆ అవతారమేంటి?’ అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలామందే. కానీ తెరపై ఆ అవతారంలోని తారక్‌ని చూసి వాళ్లే తెగ ముచ్చటపడ్డారు.

ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్‌’ అంటూ మరో కొత్త రకమైన కథని ఎంచుకొన్నారు. ఆ వైవిధ్యం గురించి అభిమానులు మాట్లాడుకోవడం ఇంకా పూర్తి కాక మునుపే… అప్పుడే ఏం చూశారన్నట్టుగా త్రిపాత్రాభినయంతో కూడిన ‘జై లవకుశ’కి పచ్చజెండా వూపి చర్చని లేవనెత్తాడు ఎన్టీఆర్‌. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూస్తారంటూ జోస్యం చెబుతున్నాయి ఆ సినిమా వర్గాలు. ఇప్పటికే విడుదలైన జై టీజర్‌ చూస్తే ఆ విషయమే స్పష్టమవుతోంది. త్వరలోనే విడుదల కానున్న లవకుశ టీజర్‌ గురించి ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొత్త సినిమా కబుర్లు

వరుస విజయాలతో జోరుమీదున్న ఎన్టీఆర్‌ కోసం ఎంతోమంది దర్శకులు కథలు సిద్ధం చేశారు. అయితే ఆయన మాత్రం ఇంకా తన కొత్త చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న ఆయన ఇప్పటికే కొన్నింటికి పచ్చజెండా వూపారని, అయితే ఎవరితో మొదట సినిమా చేయాలనే విషయంలో ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళిలాంటి అగ్ర దర్శకుల్లో ఒకరితో ఎన్టీఆర్‌ తదుపరి సినిమా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు. మరి ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ విడుదల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తారా లేదంటే, ఆలోపుగానేనా అనేది చూడాలి.

Comments

Share.

Comments are closed.