సైబర్ నేరాలపై అవగాహనకు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌ల గాత్రం
ఐదు అంశాలపై లఘుచిత్రాలు రూపొందించిన హైదరాబాద్ పోలీసులు
సినిమా హాళ్లు, టీవీలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రసారం
అంతర్జాల ఆధారిత నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో హైదరాబాద్ పోలీసులు సరికొత్త రీతిలో చర్యలకు శ్రీకారం చుట్టారు. ఫేస్బుక్, వాట్సప్, డెబిట్, క్రెడిట్‌కార్డు మోసాలు, పెళ్లిపేరుతో బహుమతులిస్తామంటూ రూ.లక్షలు స్వాహాచేస్తున్న నేరగాళ్లబారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐదు అంశాల్లో లఘుచిత్రాలను రూపొందించారు. పోలీసు అధికారులు, సినీ, టీవీ నటీనటులతో లఘుచిత్రాలను నిర్మించాక వాటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి, యువ సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ గాత్రాలను(వాయిస్ ఓవర్) జోడించారు.
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టీవీలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ లఘుచిత్రాలను ప్రసారం చేయనున్నామని హైదరాబాద్ అదనపు సీపీ(నేరపరిశోధన) స్వాతి లక్రా వివరించారు. సామాజిక మాధ్యమాలు పదునైన కత్తులనే ఇతివృత్తంతో పోలీసులు ఈ లఘు చిత్రాలను రూపొందించారు. ఫేస్బుక్, వాట్సప్ తదితరాలతో నేరగాళ్లు ఎలా ట్రాప్ చేస్తారు? ఫేస్బుక్లో వ్యక్తిగత ఫొటోలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు?. అమ్మాయిలు, అబ్బాయిల నకిలీ ఫొటోలతో ఖాతాలు తెరిచి ఎలా మోసాలకు పాల్పడుతున్నారన్న అంశాలు లఘుచిత్రాల్లో ఉన్నాయి. ఈ లఘుచిత్రాలకు జూనియర్ ఎన్టీఆర్ గాత్రం అందించారు. ఆయన సినిమా షూటింగ్లో తీరికలేకుండా ఉన్నా.. అడగ్గానే సమయం కేటాయించారని పోలీసులు తెలిపారు.
కొందరు సైబర్ నేరస్థులు యువతను ముఖ్యంగా ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారని, వారు మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలంటూ దర్శకుడు రాజమౌళిని పోలీసు ఉన్నతాధికారులు అభ్యర్థించారు. సామాజిక బాధ్యతలో భాగంగా తాను కచ్చితంగా గాత్రం అందిస్తానంటూ రాజమౌళి ముందుకురావడంతోపాటు డబ్బింగ్ థియేటర్లో లఘుచిత్రాన్ని తిలకించి తనదైన శైలిలో మార్పులు సూచించారు. ఈ లఘుచిత్రంతోపాటు డెబిట్‌కార్డులు, క్రెడిట్‌కార్డులకు సంబంధించిన మోసాలు, ఓటీపీ పిన్ నంబర్లు చెప్పకూడదంటూ నిర్మించిన చిత్రానికీ ఆయన గాత్రం అందించారు. లాటరీలు, ఇతర మోసాలపై తీసిన చిత్రానికి హీరో రవితేజతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.