కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా తెలుసంటాడు కుశ. మరి అతను ఏమేం కొట్టేశాడు? ఎవర్ని కొట్టాడనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘జై లవకుశ’ చూడాల్సిందే. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాత.
శుక్రవారం కుశ పాత్రకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. ‘జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా…’ అంటూ మొదలయ్యే ఆ టీజర్లో ఎన్టీఆర్ హుషారుగా కనిపిస్తున్నారు. ఇది వరకు జై, లవ టీజర్లని విడుదల చేశారు. జై పాత్రలో వ్యతిరేక ఛాయలు కనిపించగా, లవ పాత్రలో మంచితనమున్న వ్యక్తిగా ఎన్టీఆర్ సందడి చేశారు. కుశ పాత్రలో కొంటె కుర్రాడిగా అలరించబోతున్నారు ఎన్టీఆర్. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.