జైలవకుశ… తల్లిదండ్రులకి ఓ కానుక – ఎన్టీఆర్

0

కథానాయకుడికి ఒకసారి స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందంటే.. ఇక అదే ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయనలో నటుడు బయటికి కనిపించే ఆస్కారమే తక్కువ. కానీ ఎన్టీఆర్‌ అందుకు భిన్నం. ఆయనలో స్టారూ… నటుడూ పోటీ పడుతుంటాడు. ఎలాంటి పాత్ర అప్పజెప్పినా సరే… అలవోకగా చేసేసి ‘ఎనీ డౌట్‌?’ అంటూ సత్తా చాటుతుంటాడు. ఎన్టీఆర్‌ తన కెరీర్‌లోనే తొలిసారి త్రిపాత్రాభినయంతో ‘జై లవకుశ’ చేశారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

త్రిపాత్రాభినయం చేయాలనే ఆలోచనలు ఎప్పుడైనా వచ్చేవా?
ఎప్పుడూ లేదండీ. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎలాంటి కథ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో వచ్చిన కథే ‘జై లవకుశ’. దర్శకుడు బాబీ కథ చెప్పిన రోజే ‘జై లవకుశ’ అనే పేరుతో పాటు, ఇందులో మీరు మూడు పాత్రల్లో నటించాల్సి ఉంటుందనీ చెప్పారు. అప్పట్నుంచే మూడు పాత్రల్లో నన్ను నేను వూహించుకోవడం మొదలుపెట్టా.

మూడు పాత్రల్లో నటించాలనగానే మీ మనసులో కలిగిన భావాలు?
మూడు పాత్రల కంటే ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఈ కథ. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఈ రోజు అందుబాటులో ఉన్న సాంకేతికత దృష్ట్యా మూడు పాత్రలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇలాంటి కథలు దొరకడమే ఇక్కడ కీలకం.

ఇందులో మీకు బాగా నచ్చిన పాత్ర ఏదంటే ఏం చెబుతారు?
కష్టపడి సాధించుకొన్న దానిపై ఇష్టం ఎక్కువంటుంటారు కదా! అలా జై పాత్ర కోసం ఎక్కువగా కష్టపడ్డాను కాబట్టి, అది ఎక్కువ ఇష్టమైన పాత్ర అని చెబుతా. అయితే మూడు పాత్రల్లో ఏది పక్కన పెట్టి చూసినా ‘జై లవకుశ’ పరిపూర్ణం కాదు. కుశ తరహా కామెడీ పాత్రని నేను ‘యమదొంగ’లో చేశా. లవ తరహా పాత్రని ‘నాన్నకు ప్రేమతో’లో చేశాననుకొన్నా, జై పాత్ర మాత్రం నాకు కొత్తది.

మూడు పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
సవాళ్లు అంటే ఇష్టం నాకు. ప్రతిదీ సులభంగా జరిగిపోతుంటే అందులో పెద్దగా కిక్కేమీ ఉండదు. నా అదృష్టం కొద్దీ ‘టెంపర్‌’ మొదలుకొని ‘జై లవకుశ’ వరకు ప్రతి సినిమా ఓ కొత్త సవాల్‌తో కూడుకొన్నదే. ‘జై లవకుశ’ కథని విని, ఆస్వాదించడం పూర్తయ్యాక, నటుడిగా ఆశ మొదలైంది. అందుకే ప్రతి సినిమాకీ పడే కష్టం కంటే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డా.

ఈ దేశంలో ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుకోవచ్చు. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఒకవేళ తప్పు మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించండని అడుగుతా. నా మాట సరైనదే అనిపిస్తే చివరి వరకు కూడా దానిపైనే నిలబడతాను. అది నా నైజం. రాజకీయాల గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ఇంటికి వెళితే కుటుంబమే నా ప్రపంచం. మా అబ్బాయి అభయ్‌కి ఇంకా పూర్తిగా మాటలు రావడం లేదు. రావణా… జై జై జై అని ఆ పాట పాడుకొంటూ ఇంట్లో అల్లరి చేస్తున్నాడిప్పుడు. ఇంట్లో ఎవరైనా నీళ్ల గ్లాస్‌తో కనిపించారంటే చాలు… ‘నేను తాగించు’ అంటూ దగ్గరికొచ్చి తన చేత్తోనే నీళ్లు తాగిస్తుంటాడు (నవ్వుతూ). ఇంట్లో తను చేసే ఆ అల్లరి చూస్తూ గడిపేస్తుంటాన్నేను

జై పాత్ర నత్తితో మాట్లాడుతుంటుంది. అందుకోసం ఏమైనా తర్ఫీదు పొందారా?
నటన పరంగా తర్ఫీదు పొందడం, శిక్షణ తీసుకోవడంలాంటి విషయాల్ని నేను పెద్దగా నమ్మను. ఇంటికి రావడం ఆలస్యమైందేంటి అని తల్లిదండ్రులు అడిగినప్పుడు అదనీ, ఇదనీ కట్టు కథలు చెప్పి ఎంత బాగా నమ్మిస్తాం. దానికి శిక్షణేమైనా ఉంటుందా? నటన కూడా అంతే. మామూలుగా నత్తిలో ధైర్యం అంటే ద ద ద అంటూ ధైర్యం అని పలకాలి. కానీ నేను మాత్రం ధైర్యంలో ద అనే అక్షరం మింగేసి ఐర్యం అని పలకాలనుకొన్నా. అది చాలా సహజంగా ఉందని మెచ్చుకొంటున్నారంతా.

కథలో మిమ్మల్ని బాగా ప్రేరేపించిన విషయమేది?
స్వతహాగా భావోద్వేగాలంటే నాకు చాలా ఇష్టం. ఇందులో నచ్చిన అంశం అదే. ఒక తల్లికడుపున ముగ్గురు కవలలు పుడతారు. చిన్నపిల్లలకి సరైన మార్గదర్శనం చేయాలి, ఏది సన్మార్గం, ఏది చెడు మార్గమో చెప్పాలి. లేదంటే బయట ప్రభావం వాళ్లపై పడిపోతుంటుంది. అలాంటి ప్రభావం వల్ల ఆ తల్లి తన పిల్లల గురించి కన్న కల చెదిరిపోతుంది. అదెలా? మళ్లీ ఆ తల్లి కల ఎప్పుడు నిజమైంది? రావణ, రామలక్ష్మణులు… రామలక్ష్మణభరతులు అవుతారా? అనేదే ఈసినిమా. అన్నదమ్ముల బంధం నేపథ్యంలో సినిమాలు అరుదు. ‘మైఖేల్‌ మదన కామరాజు’, ‘భలే తమ్ముడు’ ఇలా కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ‘జై లవకుశ’ మాత్రం పూర్తిగా అన్నదమ్ముల బంధం నేపథ్యంలో సాగే సినిమా. 

ఒక పాత్ర ప్రభావం నుంచి బయటికి రావడం కష్టమైన పని. అలాంటిది మూడు పాత్రల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేశారు?
ఆ విషయంలో బిగ్‌ బాస్‌ షో బాగా సాయం చేసింది. వారాంతం వచ్చేసరికి నాకు నేను తప్ప, పాత్రలు, సినిమా ఇవేవీ గుర్తుకు రాకుండా చేసిందది. మానసికంగా నన్ను ఎప్పటికప్పుడు తాజాగా ఉండేందుకు దోహదపడింది. కథానాయికలు రాశిఖన్నా, నివేదా థామస్‌ కూడా చక్కటి సహకారం అందించారు

ఈ సినిమా వేడుకలో కల్యాణ్‌రామ్‌ ‘దానవీర శూరకర్ణ’తో ముడిపెట్టి మాట్లాడారు. సెట్‌లో నటిస్తున్నప్పుడు మీకూ ఆ సినిమా గుర్తుకొచ్చేదా?
తాతగారు నటించిన ‘భలే తమ్ముడు’, ‘దానవీర శూరకర్ణ’ చిత్రాల స్ఫూర్తి నాపై చాలా ఉంది. కల్యాణ్‌రామ్‌ అన్న మూడు పాత్రల గురించి మాట్లాడుతూ ‘దానవీర శూరకర్ణ’ని ప్రస్తావించారు. అంతే తప్ప, కథ పరంగానో, తాతగారి నటన పరంగానో కాదు.

అంచనాలు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి?
అంచనాలు తప్పు కాదు. వాటిని అధిగమించారంటే నిజాయతీగా ప్రయత్నం చేయాల్సిందే. ‘బాహుబలి’ విజయం తర్వాత దాని కొనసాగింపు చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. సాంకేతిక నిపుణుల దగ్గర్నుంచి, నటీనటుల వరకు నిజాయతీగా ప్రయత్నించడంతోనే వాటిని అధిగమించారు. సినిమా ఫలితాలు ఎవరి చేతుల్లో ఉండవు. ప్రయత్నంలో మాత్రం లోపం ఉండకూడదు.

ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టిపెడుతుండటం వల్లనే మీకు వరుస విజయాలొస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?
తప్పుల నుంచి ఏం నేర్చుకొన్నామన్నదే కీలకం. అభిమాన బలం, దర్శకుల దృష్టి… ఇలా చాలా విషయాలు నన్ను మళ్లీ సరైన దారిలోకి తీసుకొచ్చాయి.

‘టెంపర్‌’ నుంచి కెరీర్‌ పరంగా ఓ కొత్త దశ మొదలైంది కదా, ఈ ప్రయాణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
నేను డిజైన్‌ చేసుకొన్న దశ కాదు. ఇది ఎంతో కాలం ఉంటుందని కూడా అనుకోను. ప్రయాణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు ఈ దశని ఆస్వాదిస్తున్నా. కథల ఎంపిక పరంగా మరింత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొంటున్నా.

ఇప్పుడు మీ దగ్గరికొస్తున్న కథలపై మీ అభిప్రాయం?
కొత్త కథలు వస్తున్నాయి. ఎప్పుడైనా మార్పు జరుగుతున్నప్పుడు దానికి సహకారం అందిస్తేనే మనం ముందుకు వెళ్లగలుగుతాం. ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో అదే జరుగుతోంది. కొత్త తరం ప్రేక్షకులు వస్తున్నారు, వాళ్ల అభిరుచికి తగిన కథలు తయారవుతుండడంతోనే మనం మంచి ఫలితాల్ని సొంతం చేసుకోగలుగుతున్నాం.
మల్టీస్టారర్‌ చిత్రాల గురించి, పొరుగు భాషల్లో మార్కెట్‌ పెంచుకోవడం గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నారు?
కథ, పాత్రలు బాగున్నాయంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. సరైన దర్శకుడు, సరైన కథతో వచ్చారంటే మల్టీస్టారర్‌ చిత్రాలకి నేను సిద్ధమే. పొరుగు భాషల్లో మార్కెట్‌ గురించైతే ఇంకా ఏమీ ఆలోచించడం లేదు.

తదుపరి చిత్రం ఎవరితో?
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుంది. కథ విన్నాను, అదెలా ఉంటుందన్నది మాత్రం ఇప్పుడు చెప్పను. ఆయన మార్క్‌తో పాటు… నేను, త్రివిక్రమ్‌గారు కలిసి చేస్తే ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉండాలనుకొంటారో అలాగే ఉంటుంది.

నేను, కల్యాణ్‌రామ్‌ అన్న కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాం. యాదృచ్ఛికంగా అన్నదమ్ములు కలిసి చేస్తున్న సినిమాకి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంతో కూడిన కథే కుదిరింది. ఈ సినిమా చేస్తున్నన్నాళ్లూ నేనూ, అన్న చాలా ఒత్తిడికి గురయ్యాం. మేమేంటో నిరూపించుకోవడంతో పాటు, మా తల్లిదండ్రులకి ఓ కానుకగా కూడా ఈ సినిమాని ఇవ్వాలనుకొన్నాం. నిర్మాతగా కల్యాణ్‌రామ్‌ అన్నకీ, దర్శకుడిగా బాబీకి, నటుడిగా నాకూ కచ్చితంగా గుర్తుండిపోతుందీ చిత్రం. సినిమాల ఫలితాల మాటెలా ఉన్నా… నిర్మాణ విలువల విషయంలో అన్న ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థని ఓ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడేదో కష్టాల్లో ఉన్నాడు కాబట్టే తనతో నేను సినిమా చేశాననే మాట ఒట్టి వదంతి మాత్రమే

వారసత్వాన్ని నేను నమ్మను. నేను కథానాయకుడిని అయ్యాను కాబట్టి, మా అబ్బాయి అభయ్‌ కూడా అదే కావాలంటే కుదరదు. ఇంట్లో వాతావరణం తనపై ప్రభావం చూపిస్తే చెప్పలేను. మా అమ్మానాన్నలు కూడా నన్ను కథానాయకుడు కావాలని బలవంతపెట్టలేదు. అది నా తపన. తెలుగు చిత్ర పరిశ్రమలో 25 నుంచి 30 మంది హీరోలున్నారు. అందరికీ వారసత్వం లేదు కదా? ఇక్కడ ప్రతిభే ముఖ్యం. సినిమా పరంగానే కాదు, రాజకీయ పరంగానైనా, ఇంకే రంగంలోనైనా ఇదే సూత్రం వర్తిస్తుంది

 

Comments

Share.

Comments are closed.