ప్రతి ఆదివారం నేను వంటగదిలో అడుగుపెట్టాల్సిందే

0

బంతిని గోడకేసి బలంగా కొడితే ఏమవుతుంది? అంతే వేగంగా వెనక్కి తిరిగొస్తుంది. ఎన్టీఆర్‌ కూడా అంతే. తనకి ఎదురైన పరాజయాలకి దీటుగా విజయంతో సమాధానమిస్తుంటారు. ‘టెంపర్‌’కి ముందు ఆయనకి వరుసగా పరాజయాలే. అయినా సరే… ఆయన కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. ‘అభిమానులకి నచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా’ అంటూ నిజాయతీగా పోరాటం చేశాడు. ఆ పోరాటం ఫలించింది. ఇప్పుడు మళ్లీ ఆయన వరుస విజయాల సింహాసనంపై కూర్చున్నారు. ఈ ప్రయాణంలో నటుడిగా ఆయన ఎంతగా పరిణతి చెందారో… వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా పరిణతి చెందారు. జీవితాన్నీ, కెరీర్‌నీ ఎన్టీఆర్‌ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ‘జై లవకుశ’తో మరో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ‘ఈనాడు సినిమా’తో చెప్పిన విషయాలివీ…

పరీక్ష పెట్టిన సందర్భాలు

‘‘చిన్న వయసులో గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టమైన పని. తొలి అడుగుల్లోనే నా కెరీర్‌లో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఘన విజయాలు లభించాయి, వాటిని మించిన పరాజయాలూ ఎదురయ్యాయి. పరాజయాల గురించి నేనెంత సీరియస్‌గా ఆలోచించేవాణ్నో, అభిమానులు అంతకంటే ఎక్కువగా మథనపడేవాళ్లు. వాళ్లని సంతృప్తి పరిచేందుకైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సినిమాలు చేయాలనే తపన పెరిగిపోయేది. కానీ మనం అనుకొంటే మంచి సినిమా రాదు కదా! అలా వచ్చేదే అయితే ఎవ్వరూ ఫ్లాప్‌ సినిమాలు తీయరేమో. అందుకే కాలం నాకు పరీక్ష పెట్టేది. కొన్నిసార్లు మంచి సినిమాలు చేసినా అనుకొన్న ఫలితం వచ్చేది కాదు. ఇంక ఏం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తూ కూర్చున్న రోజులు నా జీవితంలో ఎన్నో’’.

అప్పుడప్పుడూ ఆగాలి

‘‘ఆలోచనలన్నీ జయాపజయాల చుట్టూనే. మనసు నిండా సినిమానే. జీవితాన్ని మరో కోణంలో చూడటం అలవాటైంది. అదెలా జరిగిందో అర్థం కాలేదు. వయసు ప్రభావమో లేదంటే నేను కలిసిన మనుషులో, వాళ్లు చెప్పిన విషయాలో, ఎదురైన సంఘటనలో తెలియదు. ‘జీవితం అంటే పరుగే కాదు, అప్పుడప్పుడు ఆగాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి. చిన్ని చిన్ని ఆనందాల్ని ఆస్వాదించాలి’ అనే విషయం అర్థమైంది. ఈ జీవితం ఒక్కటే. మళ్లీ పుడతామో లేదో ఎవ్వరికీ తెలియదు. ఈ జీవితాన్ని ఎంత అద్భుతంగా ఆస్వాదించి వెళ్లిపోవాలనేదే మనం దృష్టిలో ఉంచుకోవాలి. చివరి క్షణంలో దేవుడు బతకాలని ఉందా? అని అడిగితే ‘మంచి చెడు అన్నీ చూశాను, ఇక చాలు తీసుకెళ్లండి’ అనాలి. బహుశా దాన్నే మోక్షం అంటారేమో. ఇలాంటి పరిణతి నాలో కలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పట్నుంచీ జయాపజయాల్ని జీవితంలో ఓ భాగంగానే తీసుకోవడమే తప్ప, జీవితమే అదని ఎప్పుడూ అనుకోలేదు. మనం చేసిన ప్రయత్నం ఫలించలేదా? అయితే మళ్లీ ప్రయత్నిద్దాం అనే సానుకూల ధోరణి అలవడింది. ఆ ధోరణి నాకు ఓ కొత్త జీవితాన్ని చూపిస్తోంది. ఈ ప్రయాణంలో అభిమానులు నా వెన్నంటే నిలిచిన వైనాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’’.

 

విలువైన తప్పులు

‘‘నేను చేసిన తప్పులు చాలా విలువైనవి. అవి గొప్ప పాఠాల్ని నేర్పాయి. ఆ పాఠాలు నేర్చుకోవడంతోనే మళ్లీ ఇలా లేచి నిలుచున్నా. నాకు పరాజయం ఎదురైనా, విజయాలొచ్చినా ఆత్మ విమర్శ చేసుకోవడం మాత్రం మరిచిపోను. అద్దంలో నన్ను నేను చూసుకొని నేనేంటి అని ఆలోచిస్తుంటా. మా అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక నేను, నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. నా పనిలో మరింత నిజాయతీ కనిపిస్తోంది. అదే అభిమానులకీ నచ్చింది. ఇప్పటిదాకా నా అభిమానులు నా నుంచి కోరుకొన్నదేంటంటే నా పనిలో నిజాయతీ అనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’’.

ఇష్టమైన వ్యాపకం

‘‘అభయ్‌తో ఆడుకోవడం, సంగీతం వినడం, వంట చేయడం… ఇప్పుడు నా వ్యాపకాలు ఇవే. సంగీతం అంటే పిచ్చి. వరల్డ్‌ మ్యూజిక్‌ ఎక్కువగా వింటుంటా. అలాగే తెలుగు, తమిళం, హిందీ అనే భేదం లేకుండా అన్ని భాషల్లోని సినిమాల పాటలూ వింటుంటా. కార్లో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా సంగీతం వినడమే పని. ఇక వంట విషయానికొస్తే ప్రతి ఆదివారం వంటింట్లో అడుగుపెట్టాల్సిందే. వంట చేయడమంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఒత్తిడి నుంచి నన్ను దూరం చేసే ప్రధాన వ్యాపకం ఇదే. నూనెలో పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు ఎలా వేగిపోతుంటాయో, వంట చేస్తున్నప్పుడు నా ఒత్తిళ్లు కూడా ఆ నూనెలో వేగి ఆవిరైపోతుంటాయి (నవ్వుతూ). మన భారతీయ వంటకాలంటే ఇష్టం. అన్నీ వండుతాను కానీ… బిర్యానీ, పలావు చేయడమంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం’’.

 

ఏదీ దాచుకోలేను

‘‘తారలు వ్యక్తిగతంగా ఎలా ఉంటారనే విషయం గురించి బయట రకరకాల వూహాగానాలు, అపోహలు ఉంటాయి. అయితే వాళ్ల వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయట పెట్టే అవకాశం ఎప్పుడో కానీ రాదు. తెరపై కేవలం పాత్రల మేరకే కనిపించాల్సి ఉంటుంది కాబట్టి! కానీ ఈమధ్య నేను చేసిన బిగ్‌ బాస్‌ షో వల్ల అసలు ఎన్టీఆర్‌ ఎలా ఉంటాడో బయటపెట్టే అవకాశం లభించింది. వ్యక్తిగతంగా నేను ఏ భావోద్వేగాన్నీ దాచుకోలేను’’.

తెలుగులో మాట్లాడడం మన బాధ్యత

‘‘మన భాష, మన సంస్కృతి, మన పండగలు, మన ఆచార వ్యవహారాలు అంటే ఎంతో గౌరవం. నా ఇంట్లో ఆ వాతావరణమే ప్రతిబింబిస్తుంటుంది. మా అబ్బాయితో ఇంట్లో అంతా తెలుగులోనే మాట్లాడుతుంటాం. వచ్చిన మాటల్ని తెలుగులో స్పష్టంగా ‘ఏం చేస్తున్నావ్‌, ఎక్కడికెళ్తున్నావ్‌’ అని మాట్లాడతాడు అభయ్‌. నేను మాట్లాడితేనే కదండీ, మా అబ్బాయి మాట్లాడేది. మన తల్లిదండ్రుల నుంచి మనకు అబ్బిన సంస్కృతి, భాష మన పిల్లలకూ అందేలా కృషి చేయడం మన బాధ్యతగా భావిస్తా’’.

 

ముద్దుముద్దు మాటలు

‘‘కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఇప్పుడు నాకు అన్నిటికంటే విలువైనది నా కుటుంబమే. మా అబ్బాయి చెప్పే ముద్దు ముద్దు మాటలు, తన ఎదుగుదల క్రమం… అత్యంత విలువైనవి నాకు. ఇప్పుడు వాడితో గడిపే ఆ క్షణాల్ని వదిలిపెట్టి, ఇంటి నుంచి బయటికి రావాలంటే అంతకంటే ఉత్తేజాన్ని కలిగించే విషయం ఇంకొకటేదో ఉండాలి కదా! అందుకే నిజాయతీగా, పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచే కథల్ని ఎంచుకొని చేస్తున్నా’’.

Comments

Share.

Comments are closed.