మాట నిలబెట్టుకోనున్న రాజమౌళి?

0

‘దర్శకధీరుడు’ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తన ట్విటర్‌ ఖాతాలో చరణ్‌, తారక్‌తో కలిసి దిగిన ఫొటో పోస్ట్‌ చేయగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి ‘యమధీర’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్‌, చరణ్‌ బాక్సర్లుగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఎలాంటి గ్రాఫిక్స్‌తో కూడిన సన్నివేశాలను తెరకెక్కించడంలేదట.


రాజమౌళి సినిమాలంటేనే కళ్లుచెదిరే గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో వినోదాన్నిస్తాయి. కానీ, ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడటంలేదని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ సిద్ధం చేస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రాల విడుదల ఆలస్యానికి ప్రధాన కారణాల్లో గ్రాఫిక్స్‌ కూడా ఒకటి. ఆ చిత్రాల తర్వాత వీఎఫ్‌ఎక్స్‌తో పని లేకుండా సినిమా చేస్తానని రాజమౌళి ‘బాహుబలి2’ విడుదల సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


ప్రస్తుతం రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా సమంత నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క తారక్‌త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రానున్న చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక చరణ్‌, తారక్‌.. ‘జక్కన్న’ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Comments

Share.

Comments are closed.