విమానాశ్రయంలో చరణ్‌, తారక్‌

0

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరు కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై దర్శక, నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.


కాగా ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో భాగంగా చరణ్‌, తారక్‌ అమెరికాకు బయలుదేరారని, అందుకే మంగళవారం రాత్రి రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో కనిపించారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ చరణ్‌, తారక్‌ కలిసి కనిపించిన విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.


చరణ్‌ ఇటీవల ‘రంగస్థలం’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. దీని తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తారక్‌ ‘జైలవకుశ’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. చరణ్‌, తారక్‌ తమ తర్వాతి సినిమా పనులతోపాటు రాజమౌళి సినిమా పనుల్లోనూ పాలుపంచుకుంటున్నట్లు సమాచారం.


సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా రూపుదిద్దుకుంటోంది. సమంత కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

Share.

Comments are closed.