ఎన్టీఆర్‌ మొండితనం తారక్‌కు వచ్చింది

0

తన సినీ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, అనుభూతులను ‘పరుచూరి పలుకులు’ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన అగ్ర కథానాయకుడు తారక్‌‌ గురించి అందరికీ తెలియని ఓ విషయాన్ని పంచుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు మొండితనం ఆయన మనవడైన తారక్‌కు వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అద్దంపట్టే ఓ సంఘటనను పంచుకున్నారు.


‘వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తారక్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆది’ సినిమాకు డైలాగ్స్‌ రాయమని కోరుతూ నిర్మాత నాగలక్ష్మి నా వద్దకు వచ్చారు. కానీ నాకు సమయం లేదని చెప్పా. ఆమె బాధగా వెళ్లిపోయారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆది’కి మాటలు రాశా.’

‘డైలాగ్స్‌ రాయడం పూర్తయ్యాక, ఇంటిలో కూర్చొని రీడింగ్‌ ఇస్తుంటే నా కుమార్తె నాగసుష్మ.. ‘ఇది బాలకృష్ణ స్క్రిప్ట్‌లా ఉంది కదా.. తారక్‌ చిన్నాడు కదా’ అని అంది. ‘నందమూరి తారాక రామారావు రక్తం అది, ఎవరు చెప్పినా పండుతుంది’ అని సమాధానమిచ్చా.’


‘ఓ రోజు విశాఖపట్నంలో క్లైమాక్స్‌ షూట్‌లో తారక్‌ చేతికి అద్దాలు గుచ్చుకున్నాయి. అప్పుడు నేను షూటింగ్‌ ఆగిపోయిందా..? అని అడిగా. ‘లేదు.. తారక్‌ అలానే‌ చేసేస్తున్నారు’ అని చెప్పారు. నాకు వెంటనే అన్న(తారక‌ రామారావు) గుర్తొచ్చారు. ఆయన అంతే ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్‌ ఆగిపోనివ్వరు. తాతగారి మొండితనం ఈ పిల్లాడికి వచ్చేసింది అనుకున్నా. ‘సర్దార్‌ పాపారాయుడు’ సినిమా క్లైమాక్స్‌లో అన్న చేతికి దెబ్బ తగిలింది.. కానీ ఆయన అలాగే కుడి చేతితోనే నటించారు. షూటింగ్‌ మాత్రం ఆగనివ్వలేదు’ అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.


‘ఆది’ సినిమాలో పాత్రకు తారక్‌ న్యాయం చేశారని, వినాయక్‌ ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని పరుచూరి అభిప్రాయపడ్డారు. అనంతరం తారక్‌తో తనకు వ్యక్తిగతంగా ఉన్న బంధం గురించి చెబుతూ.. ‘ ‘ఆది’ సినిమా విలేకరుల సమావేశంలో తారక్‌ నన్ను పక్కకు పిలిచాడు. ‘మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా?’ అని అడిగాడు. నా కళ్లు చెమర్చాయి.. సరే అన్నాను. ఆ రోజు సమావేశం‌లో అందరికీ ‘నా పెదనాన్న’ అని చెప్పుకున్నాడు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు నన్ను అలానే పిలుస్తున్నాడు’ అని తెలిపారు.

Comments

Share.

Comments are closed.