‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేసే సినిమా ఏంటి? సినీ అభిమానులందర్నీ తొలి చేసిన ప్రశ్న ఇది. ఎప్పుడైతే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి జక్కన్న ఫొటో దిగాడో మల్టీస్టారర్ అంటూ వార్త దావానలంలా వ్యాపించింది. అయితే అటు రాజమౌళి నుంచి, ఇటు ఎన్టీఆర్.. రామ్‌చరణ్‌ల నుంచి ఎక్కడా మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
‘నవంబరు 18, 2017 నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గురించి ఇది అధికారిక ప్రకటన. భారీ మల్టీస్టారర్ షురూ అయింది.’ అంటూ రాజమౌళి.. రామారావు.. రామ్‌చరణ్ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘ఆర్’ వచ్చేలా ‘#RRR’ పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు. అయితే ‘ఇది టైటిల్ కాదు, టైటాన్స్(దిగ్గజాలు) కలిసి వస్తున్నారు’ అని పేర్కొన్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సోదరుల్లా నటిస్తారని సమాచారం. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. తారక్, చరణ్ పాత్రలకు సంబంధించి ఇటీవల అమెరికాలో ఫొటో షూట్ చేశారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో బిజిగా ఉండగా, త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు.