ఎన్టీఆర్‌ మరోసారి అదరగొట్టేశాడు!

0

‘పాత్ర ఏదైనా, ఘట్టమేదైనా నేను రెడీ’ అంటూ రంగంలోకి దూకే యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. అది వెండితెర అయినా, బుల్లి తెర అయినా ఆయనకు తిరుగులేదు. సరైన పాత్ర పడితే సిల్వర్‌ స్క్రీన్‌పై నట విశ్వరూపం చూపే ఎన్టీఆర్‌.. ‘బిగ్‌బాస్‌’ షోతో బుల్లితెరపైనా దడదడలాడించారు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆ షోకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. అప్పుడప్పుడూ పలు ప్రకటనల్లో మెరిసే తారక్‌.. ఇప్పుడు మరో సరికొత్త ప్రకటనలో సందడి చేశారు.


వేసవి సందడి అంటే ఐపీఎల్‌. సెలవులను హాయిగా ఆస్వాదించడానికి క్రికెట్‌ ప్రియులకు ఇంతకన్నా మంచి టోర్నీ ఉండదేమో. అలవోకగా బౌండరీలు దాటే బంతులు, ఆటగాళ్ల రికార్డుల మోతలు, చివరి బంతి వరకూ మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు ఇది క్లుప్తంగా ఐపీఎల్‌ స్వరూపం. మరి అంత క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ ఈసారి తెలుగులో ప్రసారం కాబోతోంది. ఓ ప్రముఖ ఛానెల్‌లో మ్యాచ్‌లను తెలుగు కామెంటరీతో వీక్షించవచ్చు. ఈ సందర్భంగా డిజైన్‌ చేసిన ప్రకటనలో ఎన్టీఆర్‌ తనదైన టైమింగ్‌తో అలరించారు.


‘వీవో ఐపీఎల్‌ తెలుగులో ఏంటి స్పెషల్‌’ అని స్నేహితుడు అంటే.. ‘కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్‌ లేని గాడీ, మీసాలు లేని రౌడీ, పరిగెత్తడం రాని కేడీ, ఆవకాయ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మ ప్రేమ లేని ఒడి’ అంటూ ఎన్టీఆర్‌ ప్రాసతో డైలాగ్‌లను బుల్లెట్లలా వదులుతుంటే సదరు స్నేహితుడు దండం పెట్టేస్తాడు. ‘అసలు మజా తెలుగురా’ అంటూ ఎన్టీఆర్‌ ముగించడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.


Comments

Share.

Comments are closed.