క్రికెట్‌ నరనరాల్లో జీర్ణించుకుపోయింది: ఎన్టీఆర్‌

0

క్రికెట్‌ మన నరనరాల్లో జీర్ణించుకుపోయిందని అన్నారు ఎన్టీఆర్‌. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఓ ప్రముఖ ఛానల్‌ తెలుగు కామెంటరీతో ప్రసారం చేయనుంది. తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ‘‘భారతదేశంలో మనం ఎన్నో భాషలు మాట్లాడుకుంటాం. ఒక్కోసారి ఇతర భాషలు అర్థంకాని సన్నివేశాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ, భారత్‌లో క్రీడలకు భాష బౌండరీలు ఉండవు. జాతీయ సమగ్రతను చాటి చెబుతాయి. అయితే నా దృష్టిలో క్రీడలు కూడా ఒక భాష కింద పనికొస్తాయి. ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకునేది కేవలం క్రీడల ద్వారానే. దేశంలో క్రీడల పట్ల ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా క్రికెట్‌ మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన క్రీడ. క్రికెట్‌ పట్ల ప్రేమ మనకు వారసత్వంగా వస్తోందని నేను గట్టిగా నమ్ముతా. మా నాన్నగారు క్రికెట్‌ను ఎంతో ఇష్టంగా చూసేవారు. ఆయనను చూసి క్రికెట్‌ పట్ల నేనూ ప్రేమను పెంచుకున్నా. వారసత్వంగా మా అబ్బాయికి కూడా క్రికెట్ పట్ల ప్రేమను పంచుతాను. కేవలం భారతదేశంలోనే ఈ విధంగా మనం క్రికెట్‌ను ఆస్వాదిస్తాం. అయితే ఐపీఎల్‌ ఒక కొత్త కోణాన్ని సృష్టించింది. అలాంటి ఒక కొత్త కోణానికి మన తెలుగు భాషలో కామెంటరీ చేయడం, నేను దానికి ప్రచారకర్తగా ఎన్నుకున్నందుకు స్టార్‌ ఇండియా వారికి ధన్యవాదాలు.’’ అని అన్నారు. ప్రకటనను చాలా చక్కగా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.


క్రికెట్‌ చూడటాన్ని ఇష్టపడతారా? లేక ఆడటాన్ని ఇష్టపడతారా?
ఎన్టీఆర్‌: క్రికెట్‌ చూడటం, ఆడటం రెండూ ఇష్టమే. అయితే ఒకప్పుడు బాగా ఆడేవాడిని. కానీ, ఇప్పుడు చూడటమే నాకు ఇష్టం.

ఐపీఎల్‌ తెలుగుకు ప్రచారకర్తగా మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఎలా ఫీలయ్యారు?
ఎన్టీఆర్: చాలా సంతోషంగా అనిపించింది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడానికి కూడా ఎక్కువ ఆలస్యం చేయలేదు. మనకు మరింత దగ్గరవుతుందనే సరికి రెండో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా.

ఏదైనా టీమ్‌లో భాగస్వామి అయ్యే ఆలోచన ఉందా?
ఎన్టీఆర్‌: (నవ్వుతూ..) ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదు.

మీ అభిమాన క్రికెటర్‌?
ఎన్టీఆర్‌: చాలామంది గొప్పవాళ్లు ఉన్నారు. వాళ్లను ఏమీ తక్కువ చేసే మాట్లాడటం లేదు. నేను క్రికెట్‌ చూసే వయసులో నాకు తెలిసిన క్రికెటర్‌ సచిన్‌ ఒక్కరే. ఇప్పుడు ధోని. నేనెప్పుడూ గెలిచే టీమ్‌ పట్ల ప్రేమను చూపేవాడిని. నేను పెరుగుతున్నప్పుడు నాకు తెలిసిన ఏకైక హీరో సచిన్‌.

ఇటీవల క్రికెట్‌కు సంబంధించి చాలా బయోపిక్స్‌ వస్తున్నాయి. మీకు అవకాశం వస్తే ఏ బయోపిక్‌లో నటిస్తారు?
ఎన్టీఆర్‌: ధోని బయోపిక్‌ చాలా బాగా తీశారు. కానీ, నాకు బయోపిక్‌లలో నటించడం అంటే కాస్త భయం. నేను కేవలం ఒక నటుడిని మాత్రమే. జాతీయ స్థాయి ఉన్న ఓ హీరో పాత్రలో నేను నటించాల్సి వస్తే అనుమానమే. నాకు అంత ధైర్యం లేదు.

మీరు చేసిన సినిమాల్లో సిక్స్‌ కొట్టానని అనిపించిన చిత్రమేది?
ఎన్టీఆర్‌: నా ఫస్ట్‌ సిక్స్‌ ‘సింహాద్రి’. ఆ తర్వాత చాలానే సిక్స్‌లు కొట్టా. అదే సమయంలో చాలా డకౌట్‌లు కూడా అయ్యా. జయపజయాలు అనేవి భావోద్వేగాల పరంగా ఒక పూట, ఒక రోజు ఉంటాయి. చీకటిని చూసినప్పుడే వెలుతురు విలువ తెలుస్తుంది. అమాంత పాతాళంలోకి వెళ్లిపోయిన తర్వాత పైకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. గెలుపోటములకు ఎవరూ అతీతులు కావు.

మీ కుమారుడు అభయ్‌రామ్‌ను క్రికెటర్‌ను చేసే ఆలోచన ఉందా?
ఎన్టీఆర్‌: నా కుమారుడి భవిష్యత్‌ను నిర్ణయించడానికి నేనెవర్ని. నేను హీరో అవ్వాలని మా అమ్మా నాన్నఎవరూ కోరుకోలేదు. నేను మంచి డ్యాన్సర్‌ కావాలని మా అమ్మకు కోరిక ఉండేది. డెస్టినీ ఇటు తీసుకొచ్చింది. మా అబ్బాయిని ఎటు తీసుకెళ్తుందో. మన ఇష్టాయిష్టాలను వాళ్లపై రుద్ద కూడదు. ఒక మంచి పౌరుడిగా మాత్రమే అతన్ని తీర్చిదిద్దుతా. పిల్లలను వారి భవిష్యత్‌ను వారినే నిర్ణయించుకోనీయండి. చిన్నప్పుడు మాత్రం ప్లాస్టిక్‌ బంతితో అభయ్‌, నేనూ క్రికెట్‌ ఆడుకున్నాం. (నవ్వులు) ఇప్పుడు బాగా మాటలు నేర్చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ వరకూ వచ్చాడు.


క్రికెట్‌ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
ఎన్టీఆర్‌: ఎంతో వినయంగా వృత్తి జీవితాన్ని కొనసాగించడం క్రికెట్‌ నుంచి నేర్చుకున్నదే. ఐదు గంటల పాటు అభిమానుల బరువును మోసుకుంటూ ఆడటానికి వెళ్తారు. అప్పుడు మైండ్‌లో రెండే రన్‌ అవుతూ ఉంటాయి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలో.. ఓడితే కూడా అంతేమందికి సమాధానం చెప్పాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలన్నది మాత్రం క్రికెట్‌ నుంచి నేర్చుకున్నా. విజయానికి చుట్టాలెక్కువ. అపజయం అనాథ అవుతుంది. టీమ్‌ వర్క్‌ అనేది అటు క్రికెట్‌, ఇటు సినిమాలకు రెండూ ఒకటే. సినిమాలు చేసేటప్పుడు గెలుపోటముల అతీతంగా వెళ్లిపోతుంటాం.

మీరు ఏ ఆటకు ప్రాధాన్యం ఇస్తారు?
ఎన్టీఆర్‌: నేను ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ను. నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఆటలపై దృష్టి పెట్టేంత సమయం దొరకడం లేదు. క్రీడలకు సంబంధించి క్రికెట్‌.. సాకర్‌.. రగ్బీ ఈ మూడు ఇష్టం.

ఐపీఎల్‌ 2018 సీజన్‌ కామెంటరీ ఎన్టీఆర్‌ చేస్తే?
ఎన్టీఆర్‌: నవ్వుతూ.. వాళ్లు ఇంకా అనుకోలేదు. మీరే ఆ ఐడియా ఇచ్చేస్తున్నారు. ఏ వృత్తి అయినా అంత సులభం కాదు. దానికీ నేర్పు కావాలి. మీరు చెప్పారు కాబట్టి ప్రయత్నిస్తా.


ఈ ఐపీఎల్‌లో మీరు ఏ జట్టును సపోర్ట్‌ చేస్తారు?
ఎన్టీఆర్‌: నేను హైదరాబాదీ. నా సపోర్ట్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌కే.

రాజమౌళి, ఎన్టీఆర్‌, చరణ్‌ల మల్టీస్టారర్‌ గురించి?
ఎన్టీఆర్‌: రాజమౌళిగారు కథ ఇంకా పూర్తిగా చెప్పలేదు. మమ్మల్ని మాత్రం సిద్ధం కావాలని చెప్పారు. పూర్తి విషయాలన్నీ ఆయనే చెబుతారు. మా పాత్రలు అందరినీ అలరించేలా ఉంటాయి.

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో చేస్తున్నారా?
ఎన్టీఆర్‌: నాకు ఇంకా పిలుపు రాలేదు. అవకాశం వచ్చిన రోజు మీకు చెప్పి నిర్ణయం తీసుకుంటా.

ఐపీఎల్‌ ఎవరితో కలిసి చూస్తారు?
ఎన్టీఆర్‌: చాలా మంది స్నేహితులు ఉన్నారు. మీకు తెలిసిన వ్యక్తి అంటే రాజీవ్‌.

Comments

Share.

Comments are closed.