#RRR – బార్లు తీరుతున్న పేర్లు

0

‘మా సినిమాకి మీరే పేరు పెట్టండి’ అని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచీ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం పేర్లు బారులు తీరుతూనే ఉన్నాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పేరుతో చలామణీ అవుతోంది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అక్షరాల అమరికకు తగిన పేరు సూచించమంటూ ఇటీవల రాజమౌళి అభిమానుల్ని కోరారు. అప్పటి నుంచీ కొత్త తరహా పేర్లు వస్తూనే ఉన్నాయి.  అభిమానుల నుంచి వస్తున్న స్పందన పట్ల చిత్రబృందం కూడా సంతోషంగా ఉంది.

కానీ ‘ఇంకొన్ని మంచి పేర్లు సూచించండి’ అంటూ ట్వీట్‌ చేసింది చిత్రబృందం. ఇప్పటి వరకూ వచ్చిన పేర్లతో ఓ పోస్టర్‌ని డిజైన్‌ చేసి విడుదల చేశారు. ‘రఘుపతి రాఘవ రాజారాం’, ‘రంగస్థలంలో రణరంగం’, ‘రవి చూడని రామరావణ రణరంగం’, ‘రివల్యూషన్‌ ఆఫ్‌ రామరాజు’, ‘రైజ్‌ రోర్‌ రివోల్ట్‌’, ‘రాజసం రాక్షసం రావణం’, ‘రమ్‌ రుథిరమ్‌’, ‘రామ రాజ్య రక్షక’ ఇలా… పేర్లు పోటెత్తుతూనే ఉన్నాయి. విడుదలకు ఏడాదిపైనే సమయం ఉంది. ఈలోగా.. వీటిలో ఓ పేరుని నిర్ణయిస్తారు. తెలుగు, హిందీతో పాటు కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రతి భాషలోనూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే పేరు ఉమ్మడిగా ఉంటుంది. దాని కింద క్యాప్షన్‌ మాత్రం ఒక్కో భాషకూ ఒక్కోటి ప్రకటిస్తారు.

Comments

Share.

Comments are closed.