ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్ భామ ‘ఎమ్మా రాబర్ట్స్‌’ ?

0

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్ భామ ‘ ఎమ్మా రాబర్ట్స్‌ ‘ ఆడిపాడనుందా? తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవుననే సమాధానమే  వినిపిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన అలియాభట్‌ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొంది. అప్పట్నుంచి ఎన్టీఆర్‌తో నటించే కథానాయిక కోసం రాజమౌళి, ఆయన బృందం అన్వేషిస్తోంది.

పలువురు హిందీ కథానాయికల పేర్లు వినిపించినా, తాజాగా హాలీవుడ్ నాయిక ఎమ్మా రాబర్ట్స్‌ పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఆ పాత్రలో ఇంగ్లిష్‌ హీరోయిన్‌ నటించాల్సి ఉంటుందని, అందుకే రాజమౌళి… ఎమ్మా రాబర్ట్స్‌ని సంప్రదించారని, ఇటీవల ఆయన అమెరికా వెళ్లి రావడానికి కారణం కూడా అదేనని ప్రచారం సాగుతోంది. అమెరికాకి చెందిన ఎమ్మా పలు ఆంగ్ల చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. అయితే కథానాయిక ఎంపిక గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎన్టీఆర్‌ ఇందులో కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు.

Comments

Share.

Comments are closed.